అమ్రాబాద్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో భర్తను కొడుకులతో కలిసి కిరాతకంగా హతమార్చిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను మంగళవారం సీఐ చంద్రయ్య మీడియాకు వెల్లడించారు. అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన మొబైల్ రిపేర్ షాప్ నిర్వాహకుడు బురానోద్దీన్ (50) కు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈనెల3న ఫ్యామిలీ గొడవలతో భార్య ఇద్దరు కుమారులతో కలిసి భర్త కంట్లో కారం చల్లి, దుప్పి కొమ్ము, ఇనుప రాడ్డు, పార కర్రతో కొట్టి చంపారు.
మృతదేహాన్ని ఇంటి ముందు ఖననం చేసేందుకు ప్లాన్ చేసి విరమించుకొని ఇంట్లో గోనె సంచిలో కుక్కి, వాసన రాకుండా సెంట్లు కొట్టి, ఇనుప పెట్టెలో పెట్టి మంచం కింద ఉంచారు. అనంతరం వారి ఫోన్లను ఇంటి వద్ద స్విచ్ ఆఫ్ చేసి ఈ నెల 5న తల్లి, కొడుకులు రెండు బైక్ లపై హైదరాబాద్ పరారయ్యారు. అక్కడ పార్కింగ్ లో వెహికల్స్ ఉంచి బస్సులో చెన్నై, అటు నుంచి కొల్లం మీదుగా కేరళ సమీపంలోని పాలా ప్రాంతానికి వెళ్లగా, దీన్ని పోలీసులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తమ బైక్ పై అమ్రాబాద్ చేరుకునే క్రమంలో మన్ననూర్ చెక్ పోస్ట్ వద్ద గస్తీలో ఉన్న సిబ్బంది గుర్తించి మృతుడి భార్య సఫియా, ఆమె ఇద్దరు కుమారులు ఇలియాస్, ఖదీర్ బాబాను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి, నిందితుల నుంచి హత్యకు కారణమైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.
